కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 11: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర చెరువులో ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మంగళవారం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..కొంపల్లిలోని ఊరచెరువుతో పాటు దూలపల్లిలోని సుమార్ చెరువులో పట్టాదారులు ఇటీవల మట్టికుప్పలు పోసి ఎఫ్టీఎల్ చెరువును నింపడం సరైంది కా దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో మట్టిపోసి నింపడం ద్వారా భవిష్యత్తరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే దూలపల్లిలోని చెరువును నింపడం ద్వారా చెరువు సమీపంలో ఉన్న శ్మశానవాటికలోకి పూర్తిగా చెరువునీరు చేరి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా చెరువును నింపుతుండటంతో పలువురిపై పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో అధికారులు ఫిర్యాదు సైతం చేశారన్నా రు. కానీ ఆయా చెరువుల పట్టాదారులు తిరిగి రాత్రింభవళ్లు టిప్పర్లతో చెరువును పూడ్చివేస్తున్నారన్నారు. ఎన్నో ఏండ్లుగా చెరువులుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు వారి స్వార్థం కోసం అన్యాక్రాంతంగా మారుతున్నాయని, చెరువుల్లో నింపిన మట్టిని తిరిగి తొలగించడంతో పాటు పరిరక్షణ కోసం శాశ్వత చర్యలు తీసుకునేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కౌన్సిలర్ చింతల రవీందర్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కొంపల్లిలోని ఊరచెరువు సర్వే నంబర్ 24,25,26, 288లతో పాటు సర్వే నంబర్ 2,27,28ల లో కొంతమేరా ఊర చెరువు విస్తీర్ణం ఉంది. రికార్డుల ప్రకారం 23,234 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీనిలో 3.597 ఎకరాల విస్తీర్ణంలో నీళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించా రు. దీంతో పాటుగా దూలపల్లిలోని సుమారు చెరువు సుమారు 44.927 విస్తీర్ణంలో ఉన్న చెరువు సగభాగం సర్వే నంబర్ 536,388లో ఎఫ్టీఎల్ స్థలంలో పట్టాదారులు నిబంధనలకు విరుద్ధంగా చెరువును పూడ్చివేసి చదును చేస్తున్నారు. దీనిని సంబంధిత ఇరిగేషన్, రెవె న్యూ, మున్సిపాలిటీల అధికారులు ఉమ్మడిగా సర్వే చేపట్టి ఎఫ్టీఎల్లో స్థలానికి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అయినా పట్టాదారులు చెరువును పూడ్చడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.