గోల్నాక, జూన్ 24: భార్య కోరిన కోర్కెలను తీర్చేందుకు ఓ వ్యక్తి చైన్ స్నాచింగ్‌కు పాల్పడి.. దొంగగా మారాడు. ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును కొట్టేసి.. తనఖా పెట్టగా వచ్చిన నగదుతో భార్యతో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు. చివరకు అంబర్‌పేట పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు. సోమవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఉప్పల్‌కు చెందిన సునీత్ కుమార్(24) నగరంలోని డెక్కన్ ఈవెంట్స్ సంస్థలో ఆర్గనైజర్‌గా పని చేస్తుంటాడు. అతడికి నగరానికి చెందిన ఓ మహిళతో 9 నెలల కిందట వివాహమైంది. విలాసవంతమైన జీవనం కోసం భార్య ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం దొంగగా మారాడు. ఈ నెల 19న అంబర్‌పేట డీడీ కాలనీ నివాసి, ఇండోమెంట్ శాఖలో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ అయిన డి.పారిజాత ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇదే అదునుగా భావించిన సునీత్ కుమార్ ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పరారయ్యాడు.
దొంగిలించిన పుస్తెల తాడును సికింద్రాబాద్‌లో వన్‌గ్రామ్ ఆభరణాలు విక్రయించే పి.వెంకటేశ్వర్లు సాయంతో ఈసీఐఎల్‌లోని కృష్ణ జ్యువెలర్ యజమాని రాజేశ్ రాథోడ్ వద్ద రూ.65వేలకు తనఖా పెట్టాడు. తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో సునీత్ కుమార్ తన భార్యతో కలిసి గోవా వెళ్లి.. అక్కడ రెండు రోజులు ఎంజాయ్ చేశారు. బాధితురాలు పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు గోవాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి తమిళనాడు నాగపట్నం వెళ్తున్న క్రమంలో వారిని అరెస్ట్ చేసి, అంబర్‌పేటకు తరలించారు. చైన్ స్నాచింగ్ పాల్పడ్డ సునీత్ కుమార్‌తో పాటు అతడికి సహకరించిన పి.వెంకటేశ్వర్లు, రాజేశ్ రాథోడ్‌ను కూడా అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి రెండు తులాల పుస్తెల తాడుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో కాచిగూడ ఏసీపీ వి.రఘు, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ డి.అశోక్, అంబర్‌పేట డీఐ కె.మల్లేశ్వరి, నల్లకుంట ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కేసు ఛేదించిన అధికారులను అభినందించిన డీసీపీ వారికి నగదు రివార్డులు అందజేశారు.