Hyderabad | మియాపూర్, ఆగస్టు 19 : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీనగర్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు. గత నెల 24వ తేదీన మియాపూర్ పరిధిలోని నాగార్జున ఎన్‌క్లేవ్‌లో బాలకుమారి అనే మహిళ తన కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ తీసుకెళుతున్న సందర్భంగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేష్ చౌహాన్(20)గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.