సిటీబ్యూరో: జలుబు సంబంధిత సమస్యల కోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇచ్చే సీపీఎం మాత్రలకు ప్రత్యామ్నాయంగా సెట్రిజిన్ మాత్రలు ఇస్తున్నట్లు రాజేంద్రనగర్ సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ దుర్గలత తెలిపారు. వీవీపీ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరతపై ‘సర్కార్ దవాఖానల్లో సగం మందుల్లేవ్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై డాక్టర్ దుర్గలత స్పందించారు.
రాజేంద్రనగర్ సీహెచ్సీలో సీపీఎం మాత్రలకు ప్రత్యమ్నాయంగా సెట్రిజిన్ మాత్రలను రోగులకు అందిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. గత కొంత కాలంగా సీపీఎం మాత్రలను నిలిపివేశారని, వాటికి ప్రత్యామ్నాయంగా పెద్దలకు సెట్రిజిన్ మాత్రలు, పిల్లలకు సెట్రిజిన్ సిరప్ తదితర మందులను అందజేస్తున్నట్లు వివరించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లోని మందులను దవాఖానలోని ఫార్మసీ కౌంటర్లలో సిబ్బంది ఇవ్వకపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డాక్టర్ దుర్గలత సూచించారు.