అమీర్‌పేట్ : ఆర్ధిక సామాజిక స్ధితిగతులపై తమవైన అధ్యయనాలతో సెస్ అందిస్తున్న నివేదికలు బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరమైనవి రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధిపై తాము చేస్తున్న వ్యయం ఏ మేరకు ఫలితాలిస్తున్నా యనే అంశంపై సెస్ అందిస్తోన్న సమగ్ర నివేదికలు పాలకులకు ఆయా ప్రాంతాల ఆర్ధిక సామాజిక స్ధితిగతులపై చక్కటి అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తున్నాయన్నారు.
అమీర్‌పేట్‌లో సెస్ ఆవరణలో రూ. కోట్ల వ్యయంతో చేపడుతున్న గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు ఆర్ధిక మంత్రి టి.హరీష్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ సెస్ రూపొందిస్తున్న నివేదికలు బడ్జెట్లో ఏయే రంగాలకు ఏమేరకు నిధులను కేటాయించవచ్చనే అంశంపై స్పష్టత వస్తోందన్నారు.
తమవైన అధ్యయనాలతో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల కేటాయింపు అంశాలపై దిశా నిర్ధేశనం చేస్తూ.. చక్కటి సలహాలు సూచనలు చేసే విధంగా సెస్ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.రేవతి మాట్లాడుతూ 2016 నుండి సెస్ ఆధ్వర్యంలో పీహెచ్డీ కోర్సులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం 46 మంది పీహెచ్డీ చేస్తుండగా, వీరిలో అత్యధికులు మహిళలే ఉన్నారని తెలిపారు.
సెస్ ఆవరణలో సకల వసతులతో లేడీస్ హాస్టల్ నిర్మించాలన్న ఆలోచన మేరకు తమ ప్రతిపాదనలకు స్పందిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్స్ఇన్స్టిట్యూట్ అనుమతించిందన్నారు. ఈ మేరకు మంజూరైన రూ. 5 కోట్ల నిధులలో 50 శాతం ఐసీఎస్ఎస్ఆర్, మిగిలిన 50 శాతం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు సమకూర్చిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, సెస్ వ్యవస్థాపక సభ్యులు మహేందర్‌రెడ్డి, డాక్టర్ జీ.ఆర్.రెడ్డి, సెస్ ఛైర్మన్ దిలీప సచనే, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు.