సిటీ బ్యూరో, కంటోన్మెంట్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆక్రమణలు, కబ్జాలపై ఏండ్ల తరబడిగా సీఈవోలు నోటీసులిచ్చి వెనక్కి తగ్గుతున్నారు. ఆక్రమణదారులు, కబ్జాకోరుల ప్రలోభాలకు తలొగ్గి ఎంత వేగంగా నోటీసులిస్తున్నారో అంతే వేగంగా వెనక్కి తగ్గి ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేండ్లుగా కొనసాగుతూనే ఉంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణలకు గురైన స్థలాలు, పార్కులు, రోడ్లు, ఇతర ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలు, దుకాణాలను తొలగిస్తామని నూతనంగా వచ్చిన ప్రతి సీఈవో నోటీసులు జారీ చేస్తున్నారు. కొద్దిరోజుల తర్వాత ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఆ విషయాన్నే మరుగున పడేస్తున్నారు.
ఎప్పటిలాగానే ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన అరవింద్ ద్వివేది బోర్డు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు, అన్యాక్రాంతమైన రూ.వేలకోట్ల ప్రభుత్వ స్థలాలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ ఆయన కూడా పాత వారిలాగానే వ్యవహరిస్తారా? ఆక్రమణలను తొలగించి కబ్జాకోరులపై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ కంటోన్మెంట్ వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. అరవింద్ ద్వివేది అందరిలా కాకుండా ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుతున్నారు.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఓపెన్ నాలాలు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు, డ్రైనేజీల్లో ఆక్రమణలు తొలగించాలని పబ్లిక్ ప్రిమిసెస్ ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్ యాక్ట్ 1971 ప్రకారం ఈనెల17న సీఈవో పబ్లిక్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో తొలగించకుంటే కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ 2006 ప్రకారం బోర్డు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తామే వాటిని తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం కం టోన్మెంట్లో కొత్తేం కాదు. గత పదిహేనేండ్లుగా వచ్చిన ప్రతి సీఈవో నోటీసులు జారీ చేయడం తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం పరిపాటిగా వస్తున్నది.
4 దశాబ్దాలుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సీఈవో ఆధీనంలో ఉన్న సీ క్లాస్, బీ 4 స్థలాలతో పాటు బోర్డు పరిధిలోని 300 కాలనీల 40% పార్కు స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, ఓపెన్ నాలాలు, కుంటలు, చెరువులు, రోడ్లు అన్యాక్రాంతమయ్యాయి. బోర్డు సీఈవోలుగా విధులు నిర్వహించిన ప్రేమ్‌చంద్, బాలకృష్ణ, సుజాతగుప్తా, రవీంద్ర, చంద్రశేఖర్‌ల హయాంలో నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకో లేదు. ఆక్రమణలపై ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో సీబీఐ అధికారులు బోర్డు కార్యాలయం, ఇంజినీరింగ్ అధికారుల ఇండ్లపై గతంలో దాడులు చేశారు. కేసులు నమోదు చేశారు. దీంతో అధికారులు, బోర్డు సభ్యులు ఓ విశ్రాంత న్యాయమూర్తి ద్వారా నాట్ టు అరెస్ట్ ఆదేశాలు తెచ్చుకున్నారు.
టెంపుల్రాక్ ఎన్‌క్లేవ్‌లోని ఓ పార్కుల్యాండ్లో 15 ఏండ్ల క్రితం ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టి అద్దె రూపంలో కోట్లాది రూపాయలు అర్జించారు. ఇటీవల బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణం కూడా పొందినట్లు సమాచారం. ఇదే కాలనీలో బోర్డు అధికారులు ఆరేండ్ల క్రితం ఓ భవనాన్ని సీజ్‌చేసి వెనక్కి తగ్గడంతో ఆ భవనంలో మెస్, హాస్టల్ కొనసాగుతోంది. న్యూబోయిన్‌పల్లి అమరజ్యోతి కాలనీలో అప్పటి సీఈవో బాలకృష్ణ ఓ అక్రమ భవనాన్ని సీజ్ చేయగా ఆయన బదిలీ తర్వాత ఇద్దరు నాయకులు ఓ ఇంజినీర్ సీజ్ తొలగించేందుకు కృషి చేశారు. మహేంద్రహిల్స్‌లో అత్యధికంగా పార్కు స్థలాలు అన్యాక్రాంతమ య్యాయి. ధనలక్ష్మి కాలనీ పార్కు పూర్తిగా కబ్జాకు గురై అక్రమ నిర్మాణాలు వెలవగా త్రీమూర్తి కాలనీ పార్కు ఆక్రమణలతో కుచించుకుపో యింది. న్యూసిటీ కాలనీలో రెండు పార్కు స్థలాలు కబ్జాకు గురై నిర్మాణాలు వెలిశాయి.
రత్నా సొసైటీలో ఓ నాయకుడు బావితో పాటు రోడ్డును కబ్జా చేసి భవనాన్ని నిర్మించారు. ప్యాట్నినగర్, పైగా కాలనీల్లో నాలా ఆక్రమణల వల్ల వరదలతో పరిసర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఫిర్యాదులు అందాయనే నెపంతో పేదల రేకులషెడ్లు, ఇండ్లను కూలుస్తూ.. పెద్దలకు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఫిషర్పురాలో ఓ వ్యక్తి రెండు వందల గజాల స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టాడని పునాది నుంచి ఇంటిని కూల్చివేశారు. పార్కుల్లో, సీ ల్యాండ్, బీ4 స్థలాల్లో వెలసిన బడాబాబుల నిర్మాణా ల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికైనా అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల స్థలాలను రక్షించాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుతున్నారు.