షరతులు లేకుండా కొనాలి
మేడ్చల్, రంగారెడ్డి జడ్పీల తీర్మానం
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్/రంగారెడ్డి, మార్చి30 : రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రైతులకు మద్దతుగా తీర్మానం చేశారు. మేడ్చల్ జిల్లాలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కేంద్రాన్ని నిలదీస్తూ వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు.
జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మాన ప్రతులను ఢిల్లీలోని ప్రధాని మోదీ అధికార నివాసకార్యాలయానికి చేరవేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం మండలాల ప్రజాప్రతినిధులు వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేశ్ తీర్మానాన్ని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్‌తోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, తలకొండపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్ జడ్పీటీసీలు బలపర్చి మద్దతు తెలిపారు. సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రైతు సొసైటీ.. శామీర్‌పేట మండల పరిషత్ ఏకగ్రీవ తీర్మానం
ఘట్కేసర్/ శామీర్‌పేట, మార్చి 30: రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్ రైతు సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఘట్కేసర్లో జరిగిన అర్ధ సంవత్సర సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తీర్మాన ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి పంపించాలని నిర్ణయించారు. అంతకు ముందు మేనేజర్ అర్ధసంవత్సర నివేదికను చదివి వినిపించగా, పలువురు రైతులు మాట్లాడారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బద్దం అనంత రెడ్డి, డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, జి.పోచిరెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, కె.ఉదయ్‌కుమార్‌రెడ్డి, జి.వెంకటేశ్, జి.రమేశ్ యాదవ్, జి.బాల్‌రాజు, లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి, ఎండీ. ప్రమోద్ కుమార్, మేనేజర్ రత్న జయప్రకాశ్, రైతు సభ్యులు పాల్గొన్నారు.
శామీర్‌పేటలో.. తీర్మానం
తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులకు మద్దతుగా చేసిన శామీర్‌పేట మండల పరిషత్‌లో చేసిన తీర్మాన పత్రాన్ని గురువారం మంత్రి మల్లారెడ్డికి అందజేశారు. రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీ..
రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మేడ్చల్ మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించింది. బుధవారం చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ సమావేశం జరిగింది. వడ్లను కొనుగోలు చేయాలని సమావేశంలో చేసిన ఏక్రగీవ తీర్మానం ప్రతిని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం కేసీఆర్‌కు పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, 20 మంది కౌన్సిలర్లు, నలుగురు కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.