విశ్వనగరానికి వన్నె తెచ్చే మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ భవిష్యత్ అంధకారంలో పడింది. మెట్రో రెండో దశపై కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతోంది. లక్షల కోట్లతో ప్రాజెక్టును చేపట్టాలనే కాంగ్రెస్ అత్యాశకు తాము సిద్ధంగా లేమని కేంద్రం సున్నితంగా తేల్చిచెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. నిర్మాణ భారాన్ని మోయలేమని, మెట్రో రైలు కంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలంటూ కేంద్రం కొత్త రాగం అందుకున్నది. ఈ క్రమంలో ఏంచేయాలో తెలియని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటాన్ని గమనిస్తే.. మెట్రో రెండో దశకు ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విషయంలో రాష్ట్ర సర్కార్ తొందరపాటు, కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్ట్ ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. రెండో దశ పార్ట్ ఏ- 76.4కి.మీ, పార్ట్-బీ 86.1కి.మీ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన రూ.45వేల కోట్ల భారీ ప్రణాళికలపై కేంద్రం పెదవి విరుస్తోంది. ముఖ్యంగా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో వాటాను కొనుగోలు చేయాలంటూ సూచించిన కేంద్రమే.. ఇప్పుడు రూ.15వేల కోట్లను కూడా వృథా ఖర్చుగా చూపుతోంది. 162 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించడానికయ్యే ఖర్చుతో 192 కిలోమీటర్ల ఆర్ఆర్టీఎస్(ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) నిర్మించవచ్చనీ, దాదాపు రూ.15వేల కోట్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని కేంద్రం లెక్కలేస్తోంది.
ప్రత్యామ్నాయం పేరిట కాలయాపన..
ప్రస్తుతం ఉన్న మెట్రో ట్రాక్‌పైనే ఆర్ఆర్టీఎస్ రైళ్లను నడపవచ్చనీ, యూరోపియన్ సిగ్నలింగ్ వ్యవస్థను వాడాలని కేంద్రం సూచిస్తున్నట్లుగా సమాచారం. అయితే నగర నడిబొడ్డున ఉన్న ఫ్లైఓవర్లు, భూసేకరణ సమస్యలు, అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మాణ వ్యయాన్ని కేంద్రం సాకుగా చూపుతోంది. గడిచిన ఏడాది కాలంగా మెట్రో విస్తరణపై కనీసం అడుగు ముందుకు పడకపోగా, ఇప్పుడు కేంద్రం చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తూ రాష్ట్రప్రభుత్వం సందిగ్ధంలో పడింది. రాయదుర్గం-కోకాకపేట్, ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వంటి కీలక రూట్లలో మెట్రో రావడం ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం సంకేతాలిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం..!
ఓ వైపు మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. మరోవైపు కేంద్రాన్ని ఒప్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఒకవైపు ఎల్ అండ్ టీ వాటా కొనుగోలుకు నిధుల సర్దుబాటు, మరోవైపు కేంద్రం తనదైన శైలిలో రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సన్నాయి నొక్కుల నొక్కుతుంది. మెట్రోకు బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఆర్‌ఆర్‌టీఎస్‌ను పరిశీలించాలని సూచించడం అంటే… హైదరాబాద్ మెట్రో విస్తరణను అటకెక్కించడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంక్షోభంలో నగర రవాణా వ్యవస్థ..
హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అధికారుల బృందం ఈ ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేస్తామని చెబుతున్నారు. అయితే ఇది ఆచరణలో సాధ్యం కాదన్న విషయంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఫేజ్-2 డీపీఆర్ దశలోనే ఇన్ని ఆటంకాలు ఎదురైతుంటే, అసలు నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందనేది అంతుచిక్కని అంశంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో నగర రవాణా వ్యవస్థ సంక్షోభంలో పడిందని పర్యావరణవేత్తలు, నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.