సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : రక్తం తాగే జలగల్లా కేంద్రం.. సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెంచి ప్రత్యక్షంగా నడ్డి విరిసిన కేంద్రం మరోసారి పరోక్షంగా ఆన్లైన్ ఆధారిత యాప్ వాహన సేవలు వినియోగించే ప్రయాణికులపైనా జీఎస్టీ భారం వేసిందని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఓలా, ఉబర్ తదితర టాక్సింగ్ ట్రాన్స్‌పోర్టెషన్ సర్వీసెస్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ద్విచక్రం, ఫోర్ వీలర్ రైడింగ్స్పైన కేంద్రం జీఎస్టీ ఛార్జీ విధించింది. అయితే 2021లోనే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ నిబంధనలపై ఉబర్ ఇండియా, ప్రగతిశీల ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్, ఐబీఐబీఓ గ్రూప్ లిమిటెడ్ సంస్థలు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కాగా, జీఎస్టీ విధించడం వల్ల డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటుందని, ఆర్థికపరమైన చిక్కులు తలెత్తుతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరోక్షంగా ప్రయాణికులపై ప్రభావం పడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ వాదనలు, అగ్రిగేటర్ల తరఫు వాదనలు విన్న హైకోర్టు.. జీఎస్టీ విధించడం సబబేనని పేర్కొంది. దీంతో ఇక ప్రయాణికుడు రైడ్ బుక్ చేసుకుంటే ఆపరేటర్ వసూలు చేసే ఛార్జీలు పన్ను పరిధిలోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్లు వ్యక్తిగత సర్వీస్ ప్రొవైడర్లకు భిన్నమైన వర్గానికి చెందిన వారిగా కోర్టు పేర్కొంది. అయితే కేంద్రం జీఎస్టీ విధించడంపై పరోక్షంగా డ్రైవర్లు, ప్రయాణికులపైన భారం పడుతుందని సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫేర్‌పై 50శాతం జీఎస్టీలో 5 లేదా 12 శాతం భారం పడనుందని తెలిపారు.
కరోనా కష్టకాలంలో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మోటార్ వాహన పన్ను రద్దు చేసి ఆదర్శంగా నిలిచింది. కేంద్రం మాత్రం కరోనా కాలంలో కూడా వాహన టాక్సీలు చెల్లించాలని డ్రైవర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. జీఎస్టీ విధించడం వల్ల ప్రయాణికులు, డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ సామాన్యుల జీవితాలతో ఆటలు ఆడుకునే విధంగానే ఉంటాయి.
– వేముల మారయ్య, అధ్యక్షుడు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్
అగ్రిగేటర్లపై జీఎస్టీ విధించడం పరోక్షంగా డైవర్లు, ప్రయాణికులపైనే భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్యులను మరింత కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే కంపెనీలు సరైన ఫేర్ ఛార్జీలు డ్రైవర్లకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో వాటి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి జీఎస్టీతో తమకు రావాల్సిన పన్ను గురించే ఆలోచిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు ఓలా, ఉబర్ యాప్‌ల ప్రయాణాలు ప్రియం కానున్నాయి.
– సలావుద్దిన్ షేక్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్