కాచిగూడ, ఫిబ్రవరి 8: బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అరోపించారు. దేశ వ్యాప్తంగా 75 కోట్ల మంది ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బుధవారం పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, అస్సాం, పంజాబ్ తదితర రాష్ర్టాల నుంచి వేలాది మంది భారీ ప్రదర్శనగా పార్లమెంట్ ముట్టడికి కదలివచ్చారు. ఈ ముట్టడి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు డాక్టర్ కేశవరావు, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, ఆర్.కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమైతే జనాభా ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం, వాటా ఏదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేణుమాదవ్, రాజ్‌కుమార్, గుజ్జ సత్యం, లాల్‌కృష్ణ, భూపేశ్‌సాగర్, నీలం వెంకటేశ్, నరేశ్, వెంకన్నగౌడ్, శ్రీమన్, వరప్రసాద్, నందగోపాల్, మారేశ్, హనుమయ్య, అది మల్లేశ్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.