కాచిగూడ, జూన్ 9: జల్సాలకు అలవాటుపడి రైళ్లలో సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
కాచిగూడ రైల్వే సీఐ ఎల్లప్ప తెలపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కామేశ్వరరావు కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం కుమారుడు మహమ్మద్ అహ్మద్ మోహినుద్దీన్ అలియాస్ దావూద్(27) సోఫాలు రిపేర్ చేస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడిన దావూద్‌కు సోఫాలు రిపేర్ చేస్తే వచ్చే ఆదాయం సరిపోక.. రైళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఎంచుకుని అక్కడ సెల్ఫోన్లు దొంగిలించడం, వాటిని తక్కువ ధరకు అమ్మి సొమ్ముచేసుకోవడం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కూడా ఇలాగే సెల్ఫోన్లు దొంగతనం చేశాడు. దీంతో బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం నాడు కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫామ్‌పై తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి దావూద్‌ను ఆరాతీశారు. దీంతో దావూద్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి రెండు ఖరీదైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.