Cell Phone blast : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అదే ఫోన్ విమానంలో పేలి ఉంటే ఘోరం జరిగేదని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఎయిర్‌పోర్టులోనే ఆ సెల్ ఫోన్ పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. విమానం ఎక్కే ముందు నిబంధనల ప్రకారం సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడి లగేజీని తనిఖీ చేస్తుండగా.. అతడి బ్యాగులోని సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
భద్రతాసిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ పేలడానికిగల కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేక ఇతర సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా అధికారులు నివేదిక కోరారు.