CCS CI Sudhakar | సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. సీసీఎస్‌లో దాదాపు 80 శాతం కేసుల్లో అధికారుల చేతివాటం నడుస్తుంది. గురువారం సాయంత్రం రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఇన్స్పెక్టర్ సుధాకర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుధాకర్‌ను విచారించడంతో పై అధికారులకు కూడా లంచం డబ్బుల్లో వాటాలున్నాయని చెప్పాడు. బాధితుడు రంగస్వామి రెండు రోజుల నుంచి రూ. 2.5 లక్షల లంచం ఇవ్వడానికి వచ్చాడు.
అయితే తనకొక్కడికే కాదని పై అధికారులకు కూడా ఇవ్వాలని రూ. 5 లక్షలు తెస్తేనే డబ్బులు తీసుకుంటానంటూ సుధాకర్ తెలిపాడు. రూ. 3 లక్షలు తేవడంతో గురువారం వాటిని తీసుకుంటూ సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. శుక్రవారం ఇన్స్పెక్టర్ సుధాకర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. టీమ్ – 7 ఏసీపీని కూడా ఏసీబీ విచారించింది. ఆయనకు ఈ లంచం డబ్బుల్లో వాటా ఉందా అనే విషయంపై ఏసీబీ ఆరా తీసింది. అయితే తనకు ఆ విషయం తెలియదంటూ ఏసీపీ పేర్కొన్నాడు. ఆయనతో ఏసీబీ స్టేట్మెంట్ తీసుకున్నారు.
నగరానికి చెందిన సత్యప్రసాద్ యాప్రాల్‌లో ఉన్న విల్లాను అమ్మేందుకు నిర్ణయించుకొని బోయిన్‌పల్లికి చెందిన రంగస్వామి ద్వారా ఎన్నారై హేమసుందర్‌రెడ్డికి విక్రయించి దానిపై రూ. 1.5 కోట్లు తీసుకున్నారు. అందులో నుంచి రూ. 50 లక్షల అప్పులు చెల్లించి, మిగతా కోటి రూపాయలతో నాచారంలో 1600 గజాల స్థలాన్ని ఖరీదు చేసి, దానిని డెవెలప్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే రంగస్వామి దానిని పూర్తిస్థాయిలో డెవెలప్మెంట్ చేయలేక, ప్రసాద్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడైన సత్యప్రసాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
అయితే ఈ కేసులో ఇరువర్గాలు మాట్లాడుకొని కేసులు వద్దని రాజీ కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ సుధాకర్‌కు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ సుధాకర్ మొతం సొమ్ములో 10 శాతం రూ. 15 లక్షలు ఇస్తేనే కేసు క్లోజ్ చేస్తానంటూ రంగస్వామికి తెలిపాడు. తమకు బదిలీలు ఉన్నాయని ఒప్పందం ప్రకారం మిగతా సొమ్ము తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు.
నగరంలో రూ. 75 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక నష్టం జరిగిన కేసులను సీసీఎస్‌లో నమోదు చేస్తుంటారు. బాధితులు డీసీపీని కలిసి ఫిర్యాదు చేసిన తరువాత ఆ ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు జరిపి బాధితులిచ్చిన ఫిర్యాదులో వాస్తవాలుంటే కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను ఆయా ఏసీపీల నేతృత్వంలోని బృందాలకు అప్పగిస్తుంటారు. ఆయా కేసుల తీవ్రతను బట్టి 41 సీఆర్పీసీ నోటీసులు ఇక్కడే ఇచ్చి పంపడం, మరికొందరిని అరెస్ట్ చేయడం చేస్తుంటారు.
రంగస్వామి కేసును కూడా టీమ్ 7కు అప్పగించారు. ఈ టీమ్‌కు ఏసీపీ ఉండగా ఇన్స్పెక్టర్ సుధాకర్ బృంద సభ్యుడిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తును ఇన్స్పెక్టర్ సుధాకర్ చూస్తుండటంతో అన్ని వ్యవహారాలు అతడే మాట్లాడాడు. లంచం డబ్బులో ఉన్నతాధికారులకు కూడా వాటాలున్నాయని ఏసీబీకి పట్టుబడ్డ ఇన్స్పెక్టర్, డబ్బులిచ్చిన బాధితుడు సైతం వెల్లడించడంతో ఏసీబీ మాత్రం సాధారణంగా విచారణ జరిపి ఏసీపీని వదిలేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నాంపల్లి కోర్టులు, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ క్రై స్టేషన్ (సీసీఎస్) డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (డీడీ), ఆర్థిక నేరాల విభాగం టీమ్ 7లో ఇన్స్పెక్టర్గా బాధ్యతులు నిర్వహిస్తున్న చామకూరి సుధాకర్‌ను శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ జడ్జి అఫ్రోజ్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు.