నగరాభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ అంతర్గత రహదారులకు ప్రాధాన్యతనిస్తోంది. పలు బస్తీలు, కాలనీలను ప్రధాన రహదారికి కలుపుతూ కనెక్టింగ్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే పలు సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. సర్కిల్ 17 పరిధిలోని సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించిన పలు కాలనీల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. అందులో కపాడియా లేన్, జాఫర్ అలీ బాగ్‌లో నిర్మాణం జరుగుతుండగా, సంగీత్‌నగర్, మహేశ్వరి చాంబర్స్ లేన్‌లో నూతన రోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్ధ్దం చేసింది. ఆయా రోడ్లను దశల వారీగా నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించింది.
– ఖైరతాబాద్, డిసెంబర్ 14
పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న కపాడియాలేన్, జాఫర్అలీబాగ్ల్లో నూతన సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. రూ.30లక్షలతో కపాడియా లేన్, జాఫర్అలీబాగ్లో రూ.35 లక్షలతో 200 మీటర్లు చొప్పున సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవి నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయి. వీటితో పాటు మరో రెండు కనెక్టింగ్ రోడ్ల కోసం బల్దియా ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను సిద్ధ్దం చేశారు. వాటిలో రూ.20లక్షల అంచనా వ్యయం తో సంగీత్‌నగర్, మరో రూ.20లక్షలతో మహేశ్వరిచాంబర్స్ లేన్ 200 మీటర్ల చొప్పున నూతన రోడ్లను నిర్మించనున్నారు.
ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై దృష్టిపెట్టాం. కాలనీలు, బస్తీల్లో సీసీ రోడ్లు నిర్మించాలన్నది నిర్దేశిత లక్ష్యం. ఇప్పటికే సర్కిల్లో కనెక్టింగ్ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకొన్ని ప్రతిపాదనలో ఉండగా, ప్రస్తుతం చేపట్టిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తాం.
చైతన్య, డీఈ, జీహెచ్ఎంసీ సర్కిల్ 17