CC Cameras | సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి… ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ‘కమ్యూనిటీ’, ‘నేను సైతం’ పేరిట లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, అవి హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తూ వచ్చాయి.
వెయ్యి మంది ప్రజలకు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు చదరపు కిలోమీటర్‌కు 480 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లండన్, బీజింగ్, న్యూయార్క్ నగరాలను అధిగమించిన సిటీగా హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కాదు కదా.. ఉన్నవాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి..? ఎన్ని పనిచేయడం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసులు సీసీ కెమెరాల నిర్వహణకు ప్రజల సహకారాన్ని కోరుతున్నారు.
హైదరాబాద్‌లో 5 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ‘నేను సైతం’ స్కీంలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేశారు. దీంతో పాటు 10 వేల కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ‘నేను సైతం’ కెమెరాలు చాలా వరకు పనిచేయడం లేదు. 2015 తరువాత అప్పటి ప్రభుత్వ హయాంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ..వారిని భాగస్వాములను చేసి నేను సైతం పేరుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రతి ఏటా సీసీ కెమెరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో చాలా వరకు సీసీ కెమెరాలు, వాటి కేబుళ్లు పనిచేయడం లేదు. వర్షానికి నానుతూ, ఎండకు ఎండుతూ ఇలా రోడ్డు వైపులకు ఉన్న కెమెరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. కొందరు ఇంటి యజమానులు వాటికి మరమ్మతులు చేయించుకోవడం, మరికొందరు వాటి స్థానంలో లెటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో నేరం జరుగొద్దు… జరిగితే 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలనే లక్ష్యంతో గత పదేండ్లు పోలీసులు పనిచేశారు. అందుకు తగ్గట్టుగా టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో వాడిన టెక్నాలజీని మెమెందుకు వాడాలి..ఆ సంస్కరణలు మేం ఎందుకు కొనసాగించాలనే కోణంతో కొందరు అధికారుల ఆలోచన తీరు ఉండటంతో ప్రస్తుతం చాలా వరకు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు.
ఈ క్రమంలోనే నేరం జరిగితే ముందుగా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో ఫుటేజీలను గుర్తించడానికి, గుర్తించిన దానిని విశ్లేషించేందుకు కూడా సమయం పడుతున్నది. దీంతోనే కేసుల ఛేదనలో సమయం పడుతున్నదనే వాదన వినిపిస్తున్నది.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంతో పాటు నిర్వహణ కూడా కీలకమైన అంశమే. ఈ నేపథ్యంలో కాలం గడుస్తుండడంతో నేను సైతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ఆయా యాజమాన్యాలు కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఇప్పుడు ఈ కెమెరాలను సరిగ్గా పనిచేసే విధంగా చేయడంలో ప్రజల మద్దతు కోరుతున్నామని నగర పోలీసు బాస్ ఇటీవల ట్వీట్ ద్వారా కోరారు. నగరంలో 10 వేల కమ్యూనిటీ, 5 లక్షల సీసీ కెమెరాలు ప్రజల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు మరోసారి డ్రైవ్ చేయాల్సి ఉన్నది. అందుకు ప్రజల మద్దతు కావాలని ఆయన కోరారు.