సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): సమాజానికి భద్రత కల్పించడంతో పాటు నేర నివారణ, నేర పరిశోధనలో సీసీకెమెరాల కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. శనివారం కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు కాలనీలు, గ్రామాలు, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన 860 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ రూ.79.32లక్షల వ్యయంతో ఎల్బీనగర్ జోన్ పరిధిలోని 14కాలనీలు, 14గ్రామాలలో 380సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మిగిలిన మరో 480సీసీ కెమెరాలను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 119 సమస్యాత్మకమైన దేవాలయాల్లో ఏర్పాటు చేశామన్నారు.
ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు ముందుకు రావాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు సీసీకెమెరాల ఏర్పాటులో ముందుకు వచ్చిన కాలనీల పెద్దలను ఈ సందర్భంగా సీపీ ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఎస్బీ డీసీపీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ వి.శ్రీనివాసులు, ఐటీసెల్ ఏసీపీ జె.నరేందర్‌గౌడ్, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డితో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.