నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 14న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని విధించిన డెడ్‌లైన్‌పై మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన మెమోను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 21న లేదా అంతలోపు వ్యక్తిగతంగా తప్పక కోర్టు ఎదుట హాజరుకావాలని ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14న హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది దాఖలు చేసిన మెమోపై పీపీ కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం ఇరువర్గాల తరపున వాదనలు విన్న కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది.
భద్రతా చర్యల నేపథ్యంలో తనకు అనుమతివ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అవకాశం కల్పించాలని జగన్ తరపు న్యాయవాది మంగళవారం కోర్టుకు వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పీపీ వాదనల్ని ఏకీభవించిన జడ్జి ఆక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కావాలని సూచించా రు. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో బెయిల్ నిబంధనల్ని పాటించలేద ని, విదేశీ పర్యటనలో భాగంగా ఆయన కలిసిన వ్యక్తుల ఫోన్ నంబర్లను కోర్టుకు సమర్పించలేదని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
జగన్ బెయిల్‌ను తిరస్కరించాలని కోరుతూ సీబీఐ అధికారులు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలుకేసుల్లో 11 చార్జీషీట్లను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. అన్ని కేసుల్లో ప్రధాన నిందితుడిగా జగన్ కొనసాగుతున్నారు. ఈడీ సైతం జగన్‌పై కేసుల్ని నమోదు చేసింది. జగన్ వ్యాపార లావాదేవీలు, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, మైనింగ్ లీజులు వల్ల ఆక్రమ ఆస్తుల్ని కూడబెట్టినట్టు జగన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో హాజరై విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.