CV Anand | సిటీబ్యూరో: డ్రగ్ సప్లయర్స్ వినియోగదారుల మధ్య లింక్‌లు బయటపడకుండా డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సైప్లె చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , స్థానిక పోలీసులతో కలిసి అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన యాకూబ్ అలియాస్ కుర్బా కొన్నేండ్ల కిందట స్టడీ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. సైనిక్‌పురి, టోలీచౌకి ప్రాంతాల్లో ఉంటూ.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పోలీసులకు మూడు సార్లు చిక్కడంతో కుషాయిగూడ, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇక్కడి పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం తన షెల్టర్‌ను బెంగళూర్‌కు మార్చాడు. అదే విధంగా 2016లో సూడాన్ నుంచి వచ్చిన అబ్దుల్ రహమాన్ ఉస్మాన్ ఇంగ్లిష్ కోర్సు చేసి తిరిగి స్వదేశానికి వెళ్లి, 2018లో మరోసారి స్టడీ వీసాపై వచ్చాడు. యూపీలో బీసీఏ కోర్సులో చేరాడు. 2020లో కరోనా రావడంతో తిరిగి తన దేశానికి వెళ్లిపోయి.. రెండేండ్ల తరువాత తిరిగివచ్చాడు. కోర్సు పూర్తి చేసి.. టోలీచౌక్‌లో నివాసముంటున్నాడు. తన విలాసవంతమైన జీవితానికి డబ్బుల కోసం వివిధ మార్గాలు వెతికి డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో తమ దేశానికి చెందిన వారి గురించి వెతకడంతో బెంగళూర్‌లో ఉన్న యాకూబ్‌తో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్‌పాల్, కేరళ వాసి జాకబ్‌లతో పరిచయం ఏర్పడింది.
తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను వీళ్లంతా కలిసి హైదరాబాద్‌లో వినియోగదారులకు అమ్మేందుకు సోషల్ మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపేవారు. కస్టమర్ దొరకగానే హైదరాబాద్‌లో ఉన్న రహమాన్ బెంగళూర్‌కు వెళ్లి నగరానికి సరుకు చేరవేసేవాడు. బెంగళూర్‌లో ఉన్న వారు సరుకు రహమాన్‌తో పంపిస్తే… హైదరాబాద్‌లో ఆ డ్రగ్స్ ప్యాకెట్లను రహమాన్ ఒక బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాకుండా దాచేవాడు. ఎండ, వానలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దానిని ఒక చోట పెట్టి, ఫొటో, లొకేషన్‌ను బెంగళూర్‌లో ఉన్న వాళ్లకు పంపించేవాడు. అక్కడ ఉన్న వారికి హైదరాబాద్ నుంచి కస్టమర్ డబ్బులు ఆన్లైన్లో డమ్మీ ఖాతాల్లోకి పంపగానే బెంగళూర్ నుంచి డ్రగ్స్ దాచిపెట్టిన ప్రాంతానికి సంబంధించిన ఫొటో, లొకేషన్‌ను పంపించి.. దానిని కస్టమర్‌కు చేరవేసేవారు. ఇలా డెడ్ డ్రాప్ విధానంలో సప్లయర్స్, రీసివర్స్కు లింక్‌లు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చిన ఆదాయంలో బెంగళూర్‌లో ఉండే పెడ్లర్స్, 30 నుంచి 40 శాతం డెలివరీ చేసిన వ్యక్తులకు అప్పగించేవారు.
కారు డ్రైవర్‌గా చేస్తూ డ్రగ్స్ దందా..
బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తరువాత టోలీచౌకిలో కుటుంబానికి దూరంగా నివాసిస్తున్నాడు. బెంగళూర్‌కు చెందిన చుక్వా ఒబైయ్ డెడ్ డ్రాప్ ద్వారా అదే ప్రాంతానికి చెందిన నందకుమార్‌కు డెడ్ డ్రాప్ ద్వారా డ్రగ్స్ అందిస్తుంటాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చందానగర్‌కు చెందిన నవీన్‌కు అవి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బెంగళూర్‌కు వెళ్లి ఇమ్రాన్ డ్రగ్స్ తెస్తుంటాడు. కస్టమర్లను బట్టి డెడ్ డ్రాప్ లేదా క్యాష్ ఆన్ డెలీవరీ విధానంలో మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ రెండు ముఠాలపై సమాచారం అందుకున్న హెచ్‌న్యూ నెల రోజుల పాటు నిఘా కొనసాగించి, హుమాయూన్‌నగర్, కంచన్‌బాగ్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించింది. ఉస్మాన్, యాకూబ్, నందకుమార్, మహ్మద్ ఇమ్రాన్, నవీన్‌ను పట్టుకున్నారు. ఇందులో యాకూబ్‌ను అతడి దేశానికి డిపోర్టు చేసేందుకు సిద్ధమవుతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బోల్ట్స్‌తో పాటు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఫోన్లను విశ్లేషించగా రెండు తెలుగు రాష్ర్టాల్లోని 11 మంది వినియోగదారులకు సంబంధించిన సమాచారం వచ్చింది. డ్రగ్స్ జోలికి ఎవరూ వెళ్లొదని సీపీ సూచించారు. బెంగళూర్‌లో చాలా మంది డ్రగ్ ఫెడ్లర్స్ నకిలీ గుర్తింపుతో దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గోవా, ముంబై, బెంగళూర్లలో ఉన్న స్మగ్లర్లపై కూడా నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇటీవల ఒడిశాలో ఓ గ్రామంలో హాష్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
నిందితుడు మతోన్మాది
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనలో కుట్ర కోణం లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముంబైకి చెందిన నిందితుడు సలీం మతోన్మాదిగా మారి ఆ చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ, ముంబై ఏటీఎస్‌తో కలిసి మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. నిందితుడిపై ముంబైలోనూ ఇలాంటి కేసులున్నాయన్నారు.