మేడ్చల్, మే 30: విత్తన అక్రమాలపై మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయ. అనుమతుల్లేకుండా శీతలీకరణ గిడ్డంగిలో నిల్వ చేసిన విత్తనాలు, ఒప్పందం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్లో తమ విత్తనాలుగా ప్యాక్ చేసి, అమ్మడానికి తీసుకొచ్చిన వేరే కంపెనీ విత్తనాలపై వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. మేడ్చల్ పారిశ్రామిక వాడలోని గుబ్బా శీతల గిడ్డంగిలో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు నిల్వ చేశారు. ఇందుకు వ్యవసాయ శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది.
అలాగే శీతలగిడ్డంగి యాజమాన్యం కూడా అనుమతి పత్రాలను పరిశీలించిన తర్వాత నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. నిల్వ చేసిన కంపెనీలకు ఎలాంటి అనుమతుల్లేకుండానే విత్తనాలు నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు శీతల గిడ్డంగిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2వేల కిలోల మిర్చి, మొక్కజొన్న, వరి విత్తనాలను నిల్వ చేసినట్టు గుర్తించారు. ఈ విత్తనాలు మెగా సీడ్స్, ఎన్ఆర్ఐ, హైగ్రో, పోరేజ్, మాస్టర్ అగ్రికల్చర్, శ్రీరామ్ సీడ్స్, వారాహి, వివంటాకు కంపెనీలకు చెందిన విత్తనాలుగా తేల్చారు.
నిల్వ చేసిన విత్తనాల విలువ రూ.2 కోట్లు ఉంటుందని ఏవో మాధవరెడ్డి తెలిపారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మరో ఘటనలో… ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సమృద్ధి ప్రాసిసెంగ్ యూనిట్లో యూలింక్ అగ్రిటెక్ పేరుతో న్యూజివీడ్ విత్తనాలను ప్యాక్ చేసి, విక్రయించడానికి సిద్ధం చేస్తున్నట్టు అధికారులకు వచ్చిన సమాచారంతో ప్రాసెసింగ్ యూనిట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో న్యూజివీడ్ విత్తనాలను కొనుగోలు చేసి, తమ పేరుతో విక్రయించాలంటే అవసరమైన ఒప్పంద పత్రాలు ఉండాలి. కానీ వారి వద్ద ఎలాంటి పత్రాలు లేనట్టు అధికారులు గుర్తించారు. పేరు మార్చి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షల విలువైన 30 మెట్రిక్ టన్నుల న్యూజివీడు విత్తనాలను గుర్తించి, ఆ కంపెనీపై కేసు నమోదు చేశారు.