వెంగళరావునగర్, ఫిబ్రవరి 14: 1500 రూపాయల చలానా చెల్లించే విషయంలో మాటామాటా పెరిగి చివరికి ఒకరిపై ఒకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..రహ్మత్ నగర్ లో నివాసం ఉండే యాంద్ర రామకృష్ణ (52) సినీరంగంలో మేకప్ మెన్ గా పనిచేస్తుంటాడు. హేమంత్, అజయ్ కుమార్ లతో కలిసి ఉండేవాడు. నెలరోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ నూకరాజు షూటింగులో రామకృష్ణకు పరిచయమయ్యాడు. రెండు వారాల క్రితం రామకృష్ణ నూకరాజు ద్విచక్ర వాహనాన్ని తీసుకొని కూకట్ పల్లికి వెళ్ళాడు.
మార్గమధ్యంలో బైక్ రాంగ్ రూట్ లో రామకృష్ణ నడిపాడు. దాంతో నూకరాజు బైక్ కు జరిమానాగా రూ.1500 ఈ చలాన వచ్చింది. చలాన డబ్బు ఇవ్వాలని నూకరాజు పలుమార్లు రామకృష్ణని అడిగాడు. కాగా గురువారం సాయంత్రం నూకరాజు అతనితోపాటు కో డైరెక్టర్ నారాయణ రామకృష్ణ గదికి చేరుకొని అక్కడ మద్యం సేవించారు. అనంతరం తిరిగి డబ్బు విషయం రామకృష్ణను నూకరాజు నిలదీశాడు.
ఎన్ని సార్లు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదన్న ఆవేశంలో రామకృష్ణ మెడపై గదిలో ఉన్న కత్తితో దాడి చేశాడు. కత్తి కొంత భాగం విరిగి మెడలో ఇరుక్కుపోయింది. ఆత్మరక్షణ కోసం రామకృష్ణ అక్కడున్న స్కూ్రడ్రైవర్ తో నూకరాజు తలపై మోదాడు. గదిలో ఉన్న తోటి స్నేహితులు హేమంత్, అజయ్ వారిని విడిపించి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం అందించారు.బాధితుడు మేకప్ మెన్ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.