బంజారాహిల్స్,జనవరి 26: బంజారాహిల్స్‌లో అతివేగంతో కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు సినీనటుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ మహేంద్ర థార్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ మీదకు వెళ్లడంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్దారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి కారు నడిపిన వ్యక్తిని నిజామాబాద్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ(23)గా గుర్తించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన హర్షవర్ధన్ సాదుల అనే సినీనటుడు ‘అర్జున్ దేవర’ అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తుండగా.. అతడితోపాటు కొంతమంది స్నేహితులు బంజారాహిల్స్ రోడ్ నం.13లోని శ్రీసాయి మాన్షన్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్ పబ్‌లో మద్యం సేవించి బయటకు వచ్చిన రాకేశ్ అనే స్నేహితుడిని పికప్ చేసుకుని రావాలంటూ హర్శవర్ధన్ సూచించడంతో మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, కార్తిక్ అనే యువకుడితో కలిసి హర్షవర్ధన్‌కు చెందిన మహేంద్ర థార్ కారును తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సర్కిల్ సమీపంలో యాక్సిడెంట్ చేశారు. ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి(45)అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలపాలయ్యారు.
కాగా, ఈ ప్రమాద ఘటనలో హర్షవర్ధన్‌తో పాటు మిగిలిన స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు ముందుగా కారు నడిపింది కార్తిక్ అని చెప్పారు. అయితే సీసీ ఫుటేజీలతో పాటు ఇతర ఆధారాలతో కారు నడిపింది సాంకేత్ శ్రీనివాస్ అని తేలింది. దీంతో శ్రీనివాస్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు, అతడికి లైసెన్స్ లేదనే విషయం తెలిసినా కారును ఇచ్చి పరోక్షంగా ప్రమాదానికి కారణమైన కారు యజమాని హర్షవర్ధన్‌ను ఏ-2 నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు నిందితులపై బీఎన్ఎస్ 105(2), 125(ఏ) రెడ్‌విత్ 3(5)తోపాటు పీడీపీపీ యాక్ట్, ఎంవీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఆదివారం రిమాండ్‌కు తరలించారు.