బంజారాహిల్స్, జూలై 4: ‘బిడ్దా సెప్టెంబర్ వచ్చిందంటే వచ్చేది మేమే..’ ‘నన్ను ఆపావంటే రివాల్వర్‌తో అడ్డుకునే వారిని కాల్చిపారేస్తా..’ ‘నన్ను లోపలికి పంపించకపోతే సీఎం రేవంత్‌రెడ్డి వద్ద నుంచి కాల్ వస్తుందంటూ..’ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని బెదిరింపులకు గురిచేసిన మాజీ సభ్యుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ సొసైటీ హౌసింగ్ సొసైటీ సభ్యుడిగా ఉన్న కొసరాజు జ్యోతిప్రసాద్ను సొసైటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడంటూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తొలగించారు.
సొసైటీ సభ్యత్వం కోల్పోవడంతోపాటు ప్రవర్తన సరిగాలేదన్న కారణంతో కొసరాజు జ్యోతిప్రసాద్ను జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నుంచి సైతం తొలగించారు. ఈ క్రమంలో ఆయనను క్లబ్‌లోకి రానివ్వొద్దంటూ యాజమాన్యం అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గత నెల 23వ తేదీన జూబ్లీహిల్స్ క్లబ్‌లోకి వస్తున్నానని, తనను అడ్డుకుంటే అంతు చూస్తానంటూ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న జగదీశ్‌రెడ్డికి కాల్ చేశాడు. అయితే క్లబ్‌లోకి రానివ్వడం కుదరదని జీఎం జగదీశ్వర్‌రెడ్డి సమాధానం ఇచ్చాడు.
దీంతో ఆగ్రహానికి గురైన జ్యోతిప్రసాద్ సొసైటీ కార్యదర్శితో పాటు ఇతర వ్యక్తులను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించాడు. సెప్టెంబర్ తర్వాత తామే వస్తున్నామని, నీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా పలుమార్లు ఫోన్లు చేస్తూ తనను అడ్డుకుంటే రివాల్వర్‌తో కాల్చి పారేస్తానని, సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి దగ్గర్లోనే ఉంటానని, ఆయన నుంచి కాల్ వస్తుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానంటూ బెదిరించిన జ్యోతిప్రసాద్పై చర్యలు తీసుకోవాలంటూ జీఎం జగదీశ్వర్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్న అనంతరం గురువారం బీఎన్ఎస్ 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.