శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాక్షాలు పరిశీలించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కల్పిక చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతులతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రిజం పబ్లో గత నెల 29న ప్రముఖ నటి కల్పిక మరో స్నేహితుడితో వెళ్లారు.
రాత్రి పబ్ నిర్వాహకులు నటి కల్పిక తీసుకున్న ఆహారానికి సంబంధించి రూ. 2200 బిల్లును అక్కడి వెయిటర్ అందజేశారు. కాగా, తనకు చీజ్ కేక్ కావాలని అది కూడా బిల్లు లేకుండా కాంప్లిమెంటరీ ఇవ్వాలని పట్టుబట్టారు. బ్రౌనీని అందజేసిన తృప్తి చెందకుండా కల్పిక.. సదరు బ్రౌనీ ప్లేటును విసిరిపారేసి హంగామా చేశారు. పబ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిబ్బందిని దుర్భషలాడుతూ గొడవకు దిగారు.
పైగా క్లబ్ యాజమాన్యం తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవమానించారు. ప్రిజం యాజమాన్యం మేనేజింగ్ పార్టనర్ దీపక్ బజాజ్ పోలీసులకు కల్పిక వివాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సాక్షాలతో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి సాక్షాదారులను పరిశీలించి కోర్టు ఆదేశాలతో నటి కల్పికపై కేసు నమోదు చేశారు.