బంజారాహిల్స్,అక్టోబర్ 7: తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కోపంతో సంస్థకు చెందిన సోషల్ మీడియా పేజీలో అసభ్యకరమైన వీడియోలు(Obscene videos) పోస్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పై (Assistant director)బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సినీ నిర్మాత, దర్శకుడు షేక్ నాగుల్ షరీఫ్ అనే అనే వ్యక్తి త్వరలో నిర్మించనున్న ఓ సినిమాకు సంబంధించిన కార్యాలయాన్ని బంజారా హిల్స్ రోడ్ నెం 3లోని సాగర్ సొసైటీలో ఏర్పాటు చేశాడు. సినిమాకు సంబంధించిన ఆడిషన్లు చేస్తున్నారు. కాగా, అతడివద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న టి.సృజన్ సాయి అనే యువకుడికి సినిమాకు సంబం ధించిన ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజీ నడిపించే బాధ్యతలు అప్పగించారు.
నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణులు ఆఫీషియల్ పేజీని ఫాలో అవ్వాలని నిర్మాత నాగుల్ షరీఫ్ సూచించారు. కాగా ఇటీవల సృజన్ సాయి ప్రవర్తన మీద ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో ఆఫీసుకు వచ్చిన సృజన్ సాయి అక్కడి సిబ్బందిని దుర్భాషలాడడంతో పాటు సినిమాకు చెందిన అఫీషియల్ పేజీ పేరు మార్చడంతో పాటు అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశాడు. పేజీని ఫాలో అవుతున్న మహిళలకు వాటిని పంపించాడు. ఈ మేరకు దర్శక, నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీఎస్ఎస్ 319(2),336(2), 294తో పాటు 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.