Bullet Injury | శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 : గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమాలియా దేశానికి చెందిన 26 ఏళ్ల గులెమ్ మొహమద్ హెర్సీ అనే యువకుడి మెదడులో ఉన్న బుల్లెట్‌ను శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించారు. గురువారం గచ్చిబౌలి హాస్పిటల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
సోమాలియా దేశానికి చెందిన 26 ఏళ్ల గులెమ్ మొహమద్ హెర్సీ స్వదేశంలో జరిగిన సివిల్ వార్‌లో గాయపడ్డారు. తుపాకీ కాల్పుల్లో హెర్సీ మెదడులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇటీవల హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్‌కు ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తీసుకువచ్చారు. పేషెంట్ కోమాలో ఉండి, చేతులు, కాళ్లలో బలహీనతతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా.. న్యూరోసర్జన్ డా. లక్ష్మినాథ్ శివరాజు నేతృత్వంలోని వైద్య బృందం రెండువారాల క్రితం శస్త్రచికిత్స నిర్వహించారు. 12 గంటల పాటు సర్జరీ నిర్వహించి మెదడులో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం బాధిత రోగి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
బాధిత వ్యక్తి గులెమ్ మాట్లాడుతూ.. తనకు కేర్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారని తెలిపారు. కేర్ వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కేర్ హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనాద్ శివరాజు, కేర్ హాస్పిటల్ సీఓఓ నిలేశ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.