హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): జిమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న గుండె ఉత్తేజక ఔషధాలు – కార్డియాక్ స్టిమ్యులెంట్ డ్రగ్స్ (టెర్మిన్, టెర్మివా ఇంజెక్షన్లు) ను సీజ్ చేసినట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డీ.సరిత వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని నామాలగుండులో ఎం.నరేష్ అనే వ్యక్తి శనివారం ఈ ఇంజెక్షన్లను అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు కార్ఖానా పోలీసులకు సమాచారం అందినట్టు తెలిపారు. దీంతో దాడులు చేసి కార్డియాక్ స్టిమ్యులెంట్ స్టాక్‌ను సీజ్ చేశామని పేర్కొన్నారు.
ఈ ఇంజెక్షన్లను బాడీ బిల్డింగ్ చేసే వారికి సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ ఇంజెక్షన్లను బ్లడ్‌ప్రెషర్‌ను స్థిరీకరించేందుకు, శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియా మందుగా వాడతారని అధికారులు వివరించారు. దీని వాడకంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దాడుల్లో 66 టెర్మివా, టెర్మిన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ఐదేండ్ల వరకు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు.
నార్కోటిక్ డ్రగ్స్, ఇల్లీగల్‌గా మెడిసిన్ వాడే వారి సమాచారం తెలిస్తే వెంటనే డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కి సమాచారం అందించాలని కోరారు. ఈ దాడుల్లో ఎం.నరేష్ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు బీ.గోవింద్‌సింగ్, పీ.రేణుక, జీ. సురేంద్రనాథ్‌లు పాల్గొన్నారు.