సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మాసబ్ ట్యాంక్ వద్ద ఈనెల 23న జరిగిన న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. భూవివాదాల్లో ఖాజామొయజుద్దీన్ అడ్డుగా మారుతున్నారనే కారణంతోనే ప్రత్యర్థులు అతనిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు వాహనాన్ని గుర్తించడం కోసం బుధవారం నిందితులను ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ హత్య కోసం డిసెంబర్నెలలో కిషన్ సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాలని నిందితులు ప్లాన్ చేసినా అది ఫెయిలయి మర్డర్ అయిందని నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. కారు స్టంట్స్‌లో నిపుణుడైన అభిజిత్‌తో ఈ ప్లాన్ చేయగా, ఇందుకోసం సెకండ్‌హ్యాండ్ కారు కొనుగోలు చేసి చాలాసార్లు రిహార్సల్ కూడా చేసినట్లుగా సమాచారం.
ఈనెల 22న నారాయణగూడలోని ఓ హోటల్లో సుపారీ ముఠా సమావేశమై ప్లాన్ ప్రకారం మొయిజుద్దీన్‌ను హత్య చేసి ఇబ్రహీంపట్నం వద్ద కారును వదిలేసి వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు కారును గుర్తించారు. మొయిజుద్దీన్ హత్యపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ ఈ హత్య వెనక ఎలాంటిరాజకీయ కారణాలు లేవన్నారు. నిందితులను త్వరలోనే మీడియాకు చూపిస్తామని, హైదరాబాద్ సీపీ వివరాలు చెబుతారని చెప్పారు.