కొండాపూర్, జూన్ 6: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో మియాపూర్‌కు చెందిన శ్రీరాంరెడ్డి కారు (ఏపీ09సీఏ1878) ఇనార్బిట్ మాల్ వైపు నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-45 వైపు వెళ్తున్నాడు.
కారు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకోగానే ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారును రోడ్డుపై నిలిపి ఇద్దరు బయటకు వచ్చారు. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పించారు.
కారు ఇంజిన్‌లో ఎలక్ట్రికల్ సమస్యతో ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారుపై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్ల పరిధిలో 17ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్‌తో కారు డ్రైవింగ్ చేయడం, నో పార్కింగ్ జోన్లో కారును పార్కింగ్ చేయడం వంటి చలాన్లు ఎక్కువగా ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ కారుపై రూ.11,490 ఫైన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. యాజమాని మియాపూర్ కు చెందిన శ్రీరామ్ రెడ్డి గా గుర్తించారు.