చిక్కడపల్లి, ఆగస్టు 30: బాగ్‌లింగంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నా యి.. ఎంఐజీ పార్క్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మారుతి ఆల్టో కారు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులను ఢీ కొట్టింది.
ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే వేగంతో దూసుకెళ్లిన ఆల్టోకారు.. పార్కింగ్ చేసి ఉన్న మరో కారును వెనుకాల నుంచి ఢీ కొట్టడంతో ఆ కారు కూడా దెబ్బతిన్నది. గాయపడిన విద్యార్థుల్లో అంబేద్కర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సౌమ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థిని నాగలక్ష్మి కాలు విరిగింది. వీరిద్దరిని చికిత్స నిమిత్తం శ్రీకార్ ఆస్పత్రికి తరలించారు.
ఇందులో సౌమ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కారులో నాలుగురు యువకులు ఉండగా.. అందులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఎంఐజీ పార్క్ వద్ద పోకిరీలు గంజాయి తీసుకుంటూ, సిగరెట్లు తాగుతూ.. యువతులు, మహిళలను ఇబ్బంది పెడుతుంటారని స్థానిక ప్రజలు చెప్పారు. పోకిరీల బెడద లేకుండా చూడాలని అక్కడి ప్రజలు పోలీసులను కోరుతున్నారు.