కంటోన్మెంట్. డిసెంబర్ 15. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, పాలకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువైన స్థలాలలను చారిటబుల్ ట్రస్ట్ సంస్థలకు ధారదత్తం చేయడంపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్ తెలిపారు. డైమాండ్ పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బొల్లారం, కొంపల్లి వెళ్లే మార్గంలో తుర్కపల్లి ట్రెంచింగ్ గ్రౌండ్ వద్ద గోశాల నిర్వహణకు ఓ చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు విలువైన ఎకరం స్థలం కేటాయిస్తూ గత ఏప్రిల్ 8న జరిగిన సాధారణ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, కానీ చారిటబుల్ ట్రస్ట్ సుమారు మూడు ఎకరాల స్థలం వరకు కబ్జా చేసి షెడ్లు, భవన నిర్మాణాలు చేపడుతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు.
నిజానికి బోర్డు పరిధిలో గోవులు రోడ్లపై కనిపించవని ఈ విషయం బోర్డు అధికారులకు తెలిసినా, అధికారులు పాలకులు కుమ్మక్కై కేటాయించిన ఆ స్థలం గజం లక్షన్నర రూపాయల ధర పలుకుతోందని ఆ విలువైన స్థలం కేటాయిస్తూ వేరీడ్ బోర్డు సమావేశంలో ఎలా నిర్ణయం తీసుకుంటారని దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అదేవిధంగా కార్ఖానలో మెస్సర్స్ మారుతి కన్స్ట్రక్షన్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుండగా పదిహేనేళ్ల కిందట తాను బోర్డు సభ్యుడిగా కొనసాగిన సమయంలో అనుమతులు నిలిపివేశామని, కానీ వేరీడ్ బోర్డులో రెగ్యులరైజ్‌కు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల బోర్డు ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇక సిక్‌విలేజ్‌లో జ్యోతిర్మయి సంస్థ రెండో అంతస్తు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని బోర్డు అధికారులను సంప్రదిస్తే నిబంధనల పేరుతో బోర్డు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని చెప్పారు.
నిబంధనలతో అనుమతులు కోరిన వారికి అనుమతులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసే వారికి అధికారులు అండగా ఉంటున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని పుణెలోని సదరన్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అధికారికి, ప్రిన్సిపల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.