Cantonment MLA : తనపై సొంత పార్టీకి చెందిన వారే దాడికి యత్నించారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) శ్రీగణేశ్ (Sri Ganesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనాల పండుగలో భాగంగా ఆదివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ (OU Assault) మాణికేశ్వర్నగర్లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాదాపు 20 మంది దాడి చేసేందుకు యత్నించారు. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. అయితే అప్రమత్తమైన ఆయన గన్మెన్లు కారును నేరుగా ఓయూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పార్టీకి చెందిన వారే దాడికి యత్నించారని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఓ నేత (గొల్లకిట్టు) నన్ను టార్గెట్ చేశారని వెల్లడించారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీకి ఫిర్యాదు చేశానన్నారు. ఆ వెంటనే తన సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఆదివారం తనపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారేనని చెప్పారు. అందులో ముగ్గురిని గుర్తించామని, పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. అయితే.. ఇది పార్టీ పెద్దలకు చెప్పాల్సినంత పెద్ద విషయమేం కాదన్నారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.