ఖైరతాబాద్, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిమ్స్ దవాఖానలో మంగళవారం అవగాహన వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడుతో కలిసి ప్రారంభించారు. డాక్టర్ బిరప్ప మాట్లాడుతూ, క్యాన్సర్‌కు వయస్సుతో భేదం లేదని, సరైన సమయంలో గుర్తించడం, రోగికి అవగాహన, ప్రోత్సాహం, ధైర్యం కల్పించడంతో పాటు ఆధునిక చికిత్స విధానంలో నయం చేయవచ్చన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో నిమ్స్‌కు వచ్చే రోగులకు పూర్తిగా ఉచితంగా చికిత్సను అందిస్తున్నామన్నారు. డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ, ‘యునైటెడ్ బై యూనిక్’ అనే థీమ్‌తో ప్రతి ఒక్కరినీ ప్రత్యేక దృష్టితో రోగ నిర్ధారణ చేసిన క్యాన్సర్‌కు చికిత్స అందించాలనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.
నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భారతదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య, అందిస్తున్న చికిత్స విధానాలు తదితర అంశాలతో రూపొందించిన క్యాన్సర్ రిజిస్ట్రీ పుస్తకాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, ఎగ్జిక్యూటీవ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతివీర్, ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మి భాస్కర్, డాక్టర్ కృష్ణారెడ్డి, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు అకాడమిక్ ఇన్చార్జి డాక్టర్ మార్త రమేశ్, సర్జికల్, రేడియేషన్, పాథాలజీ విభాగాలకు చెందిన డాక్టర్ రచన, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మౌనిక, డాక్టర్ రోషిణి, పారా మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాస్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, ఫీజియోథెరపి విభాగం ప్రిన్సిపాల్ డక్టార్ శ్రావణ్, మీడియా ఇన్చార్జి సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.