సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్, ప్యాకింగ్ ఎస్టాబ్లిష్మెంట్ల(దుకాణాలు)పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతోంది. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.
బుధవారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని చెంగిచర్లలో ఎస్ఆర్ ఎంటర్ ప్రైజెస్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ ప్రాంతంలో నీరు నిలిచి అపరిశుభ్రంగా ఉందని, ట్యాంక్ సమీపంలో బల్లుల సంచారం ఉన్నట్లు గుర్తించారు. బోడుప్పల్‌లోని శ్రీ సాయి గణేశ్ ఎంటర్ ప్రైజెస్ (బొల్లిగూడెం)లో డ్రింకింగ్ వాటర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. రెండు లీటర్ల కెన్బే బ్రాండ్ సీసాలు గడువు ముగిసినట్లు గుర్తించారు.
లేబుల్స్ సరిగా లేని 31 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పాల ఉత్పత్తుల తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. సరుకులు రవాణా చేసే వాహనాలకు పత్రాలు సరిగా లేవని తేల్చారు. అజ్మీర్ ఖలాకన్ 38 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. దుకాణాలపై దాడులు కొనసాగుతాయన్నారు.