హాజరుకానున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
17వేల మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
ఏడాది మొత్తం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో (2019-20, 2020-21) రెండు సంవత్సరాలకు సంబంధించి శనివారం నిర్వహిస్తున్న 10వ స్నాతకోత్సవంలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ విద్యార్థులకు కలిపి మొత్తం 95గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో శనివారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సెక్రటరీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. శ్రీవారి చంద్రశేఖర్‌కు గౌరవ డాక్టరేట్‌తో పాటు 26 రకాల కోర్సులకు కలిపి 1,19,106 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ఆధ్వర్యంలో 183 కంపెనీలతో రెండు మెగా జాబ్‌మేళాలను నిర్వహించి 17వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. యూనివర్సిటీ ఇతర దేశాలకు చెందిన యూనివర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఎమిర్జింగ్ కోర్సులు ఏఐ, ఎంఎల్, సైబర్‌సెక్యూరిటీ, ఐవోటీ, డాటాసైన్స్ వంటి నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్, ఆయా విభాగాలకు చెందిన డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.