HMDA | సిటీబ్యూరో: మహానగరి విస్తరణకు తొలి అడుగు పడింది. హెచ్ఎండీఏ పరిధిని మరో 3వేల కిలోమీటర్ల వరకు విస్తరించి మరో బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన ఐదు మాస్టర్ ప్లాన్లతో మరో ప్రణాళికతో మహానగర పరిధి విస్తరించనున్నది. దీంతో ఇప్పుడున్న హెచ్ఎండీఏ పరిధిలో సగ భాగం అదనంగా మహానగరంలో కలవనుంది.
కేబినెట్ ఆమోదంతో ఓఆర్ఆర్ నుంచి ట్రిపులార్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతం మొత్తం హెచ్ఎండీఏ ఆధీనంలోకి రానున్నది. దీనికి అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలకు కీలకమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగనుంది. అయితే 7 జిల్లాల నుంచి 11 జిల్లాలకు విస్తరించే క్రమంలో హెచ్ఎండీఏ మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడు జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామపంచాయతీలతో ఉన్న హెచ్ఎండీఏ భవిష్యత్లో 4 జిల్లాలు, 36 మండలాలు, 336 గ్రామాలు చేరనున్నాయి.
హైదరాబాద్ నగరాభివృద్ధికి ఇప్పటివరకు ఐదు మాస్టర్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2031 మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉండగా.. మరో 25 ఏళ్ల హైదరాబాద్ పురోగతికి అనువుగా ఉండేలా ఏకీకృత ఆరో మాస్టర్ ప్లాన్ను అమలు తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
హెచ్ఎండీఏ పరిధి విస్తరించనున్న నేపథ్యంలో.. అరకొర సిబ్బంది ఇప్పుడు విస్తరణకు అతిపెద్ద సవాలుగా మారనుంది. 18 ఏళ్ల కిందట హెచ్ఎండీఏకు 600 పోస్టులు మంజురైతే… ఇప్పటివరకు ఉద్యోగుల సంఖ్య 15 శాతానికి దాటలేదు. ఇక ఉద్యోగులందరినీ డిప్యూటేషన్, అవుట్ సోర్సింగ్ విధానంలో నింపుతూ నెట్టుకొస్తున్నారు. అయి ప్రభుత్వం విస్తరణపై దృష్టి పెట్టిందే గానీ, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు, చెరువుల పరిరక్షణకు చేపట్టాల్సిన ప్రణాళికలను మరింత పకడ్బందీ చేయాల్సిన అవసరం ఉంటుంది.