సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ): ఈ నెల చివరి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బుద్ధభవన్‌లోని బీ బ్లాక్ మొదటి అంతస్తు మొత్తం హైడ్రా పీఎస్‌కు కేటాయించారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి ఈనెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అధికారులు పనులు స్పీడప్ చేశారు. స్టేషన్ ఏర్పాటు తర్వాత చెరువుల, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలతో పాటు ఫైర్ సేఫ్టీ వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను అనుసరించి కేసులను ఇక్కడ నమోదు చేస్తారు. అంతేకాకుండా సుమోటోగా కూడా కేసులు నమోదు చేసే అధికారం హైడ్రాకు ఉందని అధికారులు చెప్పారు.
మరోవైపు పీఎస్ ప్రారంభానికి ముందే సిబ్బంది నియామక ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. పీఎస్‌కు, హైడ్రాకు పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే 169 మంది సిబ్బందిని కేటాయించడానికి ఆమోదం తెలుపగా, ఇందులో ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 16మంది ఇన్స్పెక్టర్లు, 16మంది సబ్ఇన్స్పెక్టర్లు, 60మంది కానిస్టేబుల్స్‌తో పాటు హోంగార్డులు, అనలిటికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లు ఉంటారు. మరోవైపు ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బందిని కూడా హైడ్రాకు కేటాయించగా మరికొంతమంది పీఎస్‌కు అటాచ్ చేయనున్నారు.