వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 7: రానున్న కాలంలో సాగులో యాంత్రీకరణే కీలకమని, వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికర్చర్ ఇంజనీరింగ్ భూపాల్) డా. ఎస్ఎన్ ఝా అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జాతీయ ఫార్మ్ ఇంప్లిమెంట్, మిషనరీ 39 వర్క్ షాపులో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2047 వికసిత్ భారత్ నాటికి, సాగులో 75 శాతం యాంత్రీకరణ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన సూచించారు.
వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నందున పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలకు ఇప్పటికే ఆదేశాలిచ్చారన్నారు. దేశంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధునాతన టెక్నాలజీలను ఉపయోగించినప్పుడు ఉత్పత్తి, ఉత్పాదకతలు అధికం అవుతాయన్నారు. యువత సాగు వైపు ఆకర్షితులు అవుతారని ఆయన అన్నారు.
రానున్న కాలంలో తక్కువ మానవ ప్రమేయంతోనే సాగు చేసే పద్ధతులు రానున్నాయని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అన్నారు. పీజేటీఏయూ, అఖిల భారత వ్యవసాయ పనిముట్లు, యాంత్రీకరణ సమన్వయ పరిశోధన ప్రాజెక్టు (ఐకార్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ , భూపాల్) మూడు రోజులు జరుగనున్నదన్నారు. పంటల సరళి, ఉత్పత్తి, ఉత్పాదకతలలో వివిధ మార్పులు వస్తున్నాయన్నారు. నాటి ట్రాక్టర్ నుంచి నేడు డ్రోన్లు, మొబైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డిజిటలీకరణ విధానాలు సాగులో వస్తున్నాయన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణలో అధునాతన పనిముట్లు, యంత్రాల అవశ్యకత రోజురోజుకు పెరుగుతుందన్నారు. వ్యవసాయ విద్యలో అమ్మాయిల శాతం రోజురోజుకు పెరుగుతుందని, ఇది మంచిపరిణామన్నారు. ఈ సందర్భంగా పలు ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఐకార్ ఏడీజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డా. కేపీ సింగ్, ఐకార్- సీఐఏఈ భూపాల్ డైరెక్టర్ సీఆర్ మెహతా, అకోలా, వర్సిటీ పూర్వ ఉప కులపతి డా. మైయాండే, భూపాల్ శాస్త్రవేత్తలు సావంత్, వర్సిటీ డీఆర్ రఘురామిరెడ్డి, డీన్ డా. జెల్లా సత్యనారాయణ, హెడ్ డా. రాజయ్య, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, బోధన, బోధనేతర సిబ్బంది, రైతులు, విద్యార్థులు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.