సైదాబాద్, జనవరి 3 : పాతబస్తీ మాదన్నపేట నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన అయ్యప్పస్వాములు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కేరళ పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌రోడ్‌పై బస్సు బోల్తా పడడంతో డ్రైవర్ మదను రాయన్న అలియాస్ రాజు (52) అక్కడికక్కడే మృతి చెందగా, 8 మంది అయ్యప్ప స్వాములు గాయపడ్డారు. బుధవారం ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన గురుస్వాములు రాంపాల్ యాదవ్, మేకల అభియాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవ్‌ల ఆధ్వర్యంలో సుమారు 27 మంది స్వాములు గత నెల 29న బస్సులో శబరిమలకు బయలుదేరారు.
ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బుధవారం ఉదయం డ్రైవర్ శివ బస్సు నడుపుతుండగా.. రాజు పడుకున్నాడు. కేరళ పంపానది సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌రోడ్డు మలుపులో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో క్యాబిన్లో పడుకున్న డ్రైవర్ రాజు ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెంద గా 8మంది స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజుది యాదాద్రి -భువనగిరి జిల్లా రాయగిరి కమ్మగూడెం. సైదాబాద్ ఏకలవ్యనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మృ తుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు.
బుధవారం ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ శివ బస్సును నిద్రమత్తులో నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నది. అప్పటి వరకు బస్సును నడిపిన రాజు క్యాబిన్లో నిద్రిస్తుండగా, ప్రమాదానికి గురికాగానే బస్సు అద్దాల్లో నుంచి ఎగిరి కిందపడటంతోనే మృతి చెం దాడు. బస్సు మూడు భారీ చెట్లపై పడడంతో స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని అదే రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న అయ్యప్పస్వాములు పోలీసులకు సమాచారం అం దించడంతో సకాలంలో స్పందించి తగు చర్యలు చేపట్టారు. వెంటనే గాయపడ్డ క్షతగాత్రులను కోటాయం మెడికల్ కాలే జి దవాఖానకు తరలించగా ఒక రోజు చికిత్స పొందారు. గురువారం ఉదయం డిచ్చార్జి అయి.. స్వాములంతా శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని శుక్రవారం సాయంత్రం మాదన్నపేటకు చేరుకున్నారు.
కేరళ పంపానది సమీపంలో నగరానికి చెందిన అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదానికి గురైన ఘటన గురించి తెలియగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ స్పందించారు. కోట్టాయం జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు. మరణించిన బస్సు డ్రైవర్ రాజు మృతదేహానికి పోస్టుమార్టం వేగవంతంగా చేయించి ఉచిత అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించగా.. పంపించారు.