సిటీబ్యూరో, ఏప్రిల్ 17( నమస్తే తెలంగాణ) : అమెరికా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ల ఐపీవోలు తీసుకుంటే అనుకున్న లక్ష్యాలను ఈజీగా సంపాదించవచ్చని, అందుకు తగిన నైపుణ్య శిక్షణ కూడా తామే ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు.
ట్రేడింగ్‌లో త్వరగా లాభాలు సంపాదించేందుకు తాము క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు చేశామని, ఇందులో మీరు సభ్యులుగా చేరితే భారీ లాభాలు సంపాదించవచ్చు అంటూ దమ్మాయిగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి రూ.52 లక్షలు బురిడీ కొట్టించారు. బాధితుడి నంబర్ ను వీఐపీ 8 స్టాక్ మార్కెట్ వెల్త్ సీక్రెట్ అండ్ స్ట్రాటజీ గ్రూప్‌లో యాడ్ చేశారు.
ఇక్కడ మార్కెట్ లో రోజు జరిగే లావాదేవీలకు సంబంధించిన చర్చ జరుగుతుందని, మీరు కొన్ని రోజులు గమనించండి అంటూ బాధితులకు సూచన చేశారు. విశాల్ శర్మానే పేరుతో సైబర్ నేరగాడు బాధితుడికి ఫోన్ చేసి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ రీడింగ్ డాట్ కామ్ కొత్తగా తయారైందని చెప్పారు. ఇది అసలైన మార్కెట్ ప్రారంభానికి ముందు ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ అని, అందులో అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇండియన్ సబ్స్టిట్యూషన్ సంబంధించిన వివరాలు ముందుగానే తెలుస్తాయని నమ్మించారు.
ఆ మరుసటి రోజు బాధితుడికి టెలిగ్రామ్ ద్వారా ఒక లింకులు పంపించి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాధితులు ఆప్ డౌన్లోడ్ చేసుకొని మొదట రూ.పదివేలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పదివేలకు కొంత లాభం వచ్చిందంటూ సైబర్ రకాలు యాప్‌లో సూచించారు. దీంతో రూ.8.5 లక్షలతో ఐపీఓ షేర్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.42లక్షలు పే చేయాల్సి ఉందని, తర్వాత చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచన చేశారు.
ఇంతటితో యాప్ లో తనకున్న షేర్లు వేల్యూ 81.62 లక్షలు చూపించడంతో బాధితులు అది నిజమైనదిగా నమ్మాడు. తర్వాత మరో రూ.15 లక్ష ల వరకు వెచ్చించి మరో కంపెనీ షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మొత్తం సుమారు రూ.52.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయి తే స్క్రీన్‌పై భారీ మొత్తంలో డబ్బు కనిపించినా విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. విత్ డ్రా చేసుకోవాలంటే మరింత మొత్తం చెల్లించాలంటూ షరతులు విధించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.