
ముషీరాబాద్, జనవరి 30: నియోజకవర్గంలో స్వచ్ఛత సాధించే దిశగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణాలోపం కారణంగా టాయిలెట్ల నిర్వహణ గాలికి వదిలారు. వినియోగంలోకి తీసుకురాకుండా చోద్యం చూస్తున్నారు. ఫలితంగా పలుబస్తీలు, ప్రధాన రోడ్ల వెంట ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ పనికి రాకుండా పోతున్నాయి. సర్కిల్లోని పలు పార్కులు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, ఖాళీ ప్రదేశాలలో ఏడాది క్రితం మోడ్రన్ టాయిలెట్స్ బీవోటీ (బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్) ప్రతిపాదికన, ప్రీ ప్యాబ్రికెటెడ్ టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వీటిలో కొన్ని వినియోగంలోకి వచ్చినా, మిగతా వాటిని పట్టించుకోవడం లేదు. పలు ప్రధాన మార్గాలో దాదాపు 50 వరకు ఫ్రీ ప్యాబ్రికెట్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినా వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ జెడ్బీ గార్డెన్ సమీపంలో నిర్మించిన మోడ్రన్ టాయిలెట్ నిరుపయోగంగా ఉంది. సర్కిల్లో బీవోటీ 14, నీఎఫ్టీ 31, షీ టాయిలెట్స్-3, బయో-7, ఆర్సీసీ-19 మొత్తం 74 టాయిటెల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 14 టాయిలెట్స్ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మరో 19లో వసతులు కల్పించి తమకు అప్పగించాల్సి ఉందని పారిశుధ్య విభాగం అధికారులు చెబుతున్నారు. షీ టాయిలెట్స్ నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
టాయిలెట్స్ నిర్వహణను గాడిలోపెడతాం. కొన్నింటిని ఇంజినీరింగ్ అధికారులు పూర్తి చేసి, సౌకర్యాలు కల్పించకపోవడంతోనే పబ్లిక్ టాయిలెట్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేకపోయాం. స్వచ్ఛత సాధన దిశగా పబ్లిక్ టాయిలెట్స్‌ను రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొస్తాం.