సిటీబ్యూరో: భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతుల్లో ఎక్కడా జాప్యం లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే దరఖాస్తుదారులు అనుమతి పొందేలా ప్లానింగ్ విభాగం అధికారులు పనిచేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కీలకమైన విభాగాలపై సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ మంగళవారం ఇంజినీరింగ్ విభాగంపైనా, బుధవారం ప్లానింగ్ విభాగంపై ఎక్కువ సమయం సమీక్షించారు. ఈ సందర్బంగా హెచ్ఎండీఏలో ప్లానింగ్ విభాగం పరిధి, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, ఎలాంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నారు. మొత్తం 4 జోన్లైన శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్లలో ఎక్కువగా శంకర్‌పల్లిలో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులతో పాటు భవన నిర్మాణాలు, లేఅవుట్ల కోసం దరఖాస్తులు రాగా, ఆ తర్వాత శంషాబాద్, మేడ్చల్లు ఉన్నాయి. ప్రణాళిక విభాగంలోని ప్లానింగ్ ఆఫీసర్స్‌తో పాటు జేపీఓ, ఏపీఓల పనితీరు ఎలా ఉందని ఆరా తీశారు జోన్ల వారీగా అనుమతుల జారీ ఎలా ఉందన్న దానిపైనే ప్లానింగ్ విభాగం డైరెక్టర్లతో చర్చించారు.