ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 5: ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని చెప్పారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బౌద్ధనగర్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రాఘవ గార్డెన్స్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మారావుతో పాటు పార్టీ జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్‌కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును రెండు కళ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్నారని వివరించారు.
దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు, సంపదను కొల్లగొట్టేందుకు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వివిధ శక్తులు పొంచి ఉన్నాయని అన్నారు. ఆ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ శక్తులను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. మోతె శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి, ప్రజలకు మధ్య వారథిగా ఉన్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి, బీఆర్ఎస్ యువనేతలు కిరణ్, రామేశ్వర్, నాయకులు గంగపురం ఆంజనేయులు గౌడ్, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు పాల్గొన్నారు.