శేరిలింగంపల్లి, డిసెంబర్ 23: పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి.. తిరిగి హాస్టల్‌కు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్‌రోడ్డుపై వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన మెడికల్ షాపు యజమాని నర్సయ్య, పూజ దంపతుల కూతురు శివానీ(21) గండిపేటలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది.
గండిపేట సమీపంలోని మై ఫెరల్స్ గర్ల్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. ఆదివారం నిజాంసాగర్ నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉండగా.. ఇక్కడే చదివిన శివానీ ఉదయం 5 గంటలకు వెళ్లింది.. అనంతరం సాయంత్రం కూకట్‌పల్లిలో బస్సు దిగి దుండిగల్‌లో నివాసం ఉండే స్నేహితుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసింది. దీంతో అతను వచ్చి.. తన ద్విచక్రవాహనంపై శివానీని తీసుకొని గండిపేట్‌లోని హాస్టల్లో దించేందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో రాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్‌రోడ్డుపై వీరి వాహనాన్ని వెనకనుంచి అతివేగంగా దూసుకువచ్చిన స్కోడాకారు (టీజీ09 3309) ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై నుంచి వారిద్దరు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు వారిని కొండాపూర్‌లోని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా అప్పటికే శివానీ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉండడంతో మదీనాగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. స్కోడాకారును నడిపి ప్రమాదానికి కారణమైన శ్రీకాలేశ్ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించనట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.