ఉస్మానియా యూనివర్సిటీ : విద్యారంగ సమస్యలపై ఆందోళనకు సిద్ధమైన ఐక్య విద్యార్థి సంఘాల నేతల అక్రమ అరెస్టును బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన విద్యార్ధి సంఘనేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకుండా ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకుని విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
దాదాపు రెండేళ్ల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ వారికి విద్యను దూరం చేస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ,విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఇతర విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.