ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12: ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ప్రశ్నించారు. గత నెలలో రేవంత్ ఓయూకు వచ్చి.. సెల్ఫీలు, ఫొటోలు దిగి ఇచ్చిన జీవోతో ఓయూకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థి ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందాల పోటీలు, మంత్రుల పర్యటనలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యాసంస్థల్లో వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. తక్షణమే విద్యావ్యవస్థపై దృష్టి సారించడంతో పాటు ఓయూకు ప్రకటించిన ప్రత్యేక నిధులను విడుదల చేయాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ నాయకులు.. రామకృష్ణ, ప్రశాంత్‌రెడ్డి, సంతోష్‌నాయక్, దామోదర్, మధు తదితరులు పాల్గొన్నారు.