ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో 25న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాతే ఓయూ గడ్డపై అడుగుపెట్టాలని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా రాజకీయ పర్యటనలతో వర్సిటీకి ఎటువంటి లాభం లేదని స్పష్టం చేశారు.
ఓయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ఓయూ విద్యార్థుల మెస్ బకాయిలు రద్దు చేసి, విద్యార్థులకు ఫ్రీ భోజన సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతీ పరిశోధక విద్యార్థికి రూ.20 వేల ఫెలోషిప్ మంజూరు చేయడంతో పాటు ల్యాప్‌టాప్‌ను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా, నేటికీ విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకుని ప్రభుత్వ వర్సిటీలపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు.
కార్పొరేట్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కొమ్ము కాస్తూ పైసలు దండుకోవడం పనిగా పెట్టుకున్నారే తప్పితే.. ఏ రోజైనా ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. వర్సిటీకి రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వర్సిటీని ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేలా వర్సిటీ బ్లాక్ గ్రాంట్స్ నిధులు కేటాయించడం.. ఇలా ఎన్నో విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
వీటిపై ఆలోచన చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో నిధులతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవానికి రావడం సిగ్గుచేటన్నారు. వర్సిటీలో పెరిగిన విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నూతన హాస్టళ్లు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రేవంత్‌రెడ్డితో సహా ప్రభుత్వంలో ఉన్న ఒక్క ప్రజాప్రతినిధిని కూడా ఓయూలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 25న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించడంతో పాటు ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు శనివారం ఖరారయ్యాయి. ఈ పర్యటన గతంలో ఈ నెల 21న ఖరారు కాగా, అది తెలిసినప్పటి నుంచి వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓయూ గడ్డపై ఆయనను అడుగుపెట్టనీయమని హెచ్చరించాయి. తాజాగా సీఎం ఓయూ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.