సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహకంలోని విలువైన భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మూసీ సుందరీకరణ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం మూసీ బాధితుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదల ఇండ్లను కూల్చి ఆ స్థానంలో కట్టే భవనాలకు బఫర్ జోన్ వర్తించదా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చి పెద్దలకు దోచిపెడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే 50 బృందాలుగా విడిపోయి బాధితులకు భరోసా కల్పిస్తున్నామని, ప్రభుత్వం ఇండ్లను కూలిస్తే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి భూములను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజల ఇండ్లను, భూములను చెరబడతామంటే చూస్తూ ఊరుకోమని, బాధితుల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రకటించారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, మూసీ నదికి హద్దులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు కూలుస్తామని నోటిఫికేషన్లు ఇస్తూ పేదలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బస్తీ జేఏసీ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి ఎక్కడ విలువైన భూములను కనిపించినా దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, లగచర్ల, వెలుగుమట్లలో భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారన్నారు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరిట భూములను లాక్కునేందుకు ప్రయత్నించినా అదే పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదర్ ఎన్క్లేవ్, రిచ్మండ్ విల్లాస్, సాయిరాం నగర్, విగ్నేశ్వర కాలనీ, మొఘల్ కాలనీ, ఫోర్ట్ వ్యూ కాలనీ, పీజీ కాలని తదితర బాధిత ప్రజలు పాల్గొన్నారు.
మురుగు నియంత్రించకుండా భవనాలు కడ్తారా?
మూసీలోకి ఫార్మా పరిశ్రమల నుంచి ప్రమాదకర రసాయనాలు విడుదల చేస్తున్నారు. అందులో ఉండే బ్యాక్టీరియాను తట్టుకునేందుకు మానవ రోగనిరోధక శక్తి పనిచేయలేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాంటి ప్రమాదకారకాలను తొలగించి మూసీని శుద్ధి చేయకుండా బఫర్ జోన్ పేరిట ప్రజల ఇండ్లను లాక్కుంటారా? గతంలో బీఆర్ఎస్ మూసీ సుందరీకరణ పనులు చేసింది కానీ ఒక్క ఇంటినీ కూల్చలేదు. ఒక్క గజం భూమిని లాక్కోలేదు. వచ్చే ఎన్నికల్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఆపేసి పేదలకు భరోసా కల్పించేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెడితే అందరం సహకరించి, అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తాం. జీవితంలో సంపాదించిందంతా పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు దాన్ని కూల్చి దేనికీ పనికిరాని టీడీఆర్ ఇస్తామంటే ఏం చేయాలి. మేం ఇండ్లు కట్టుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అన్ని అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయనడం దారుణం. బాధిత ప్రజలను విడగొట్టి ప్రభుత్వం ఇండ్లు, భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరం కలిసి కట్టుగా ఉండి ఇండ్లు పోకుండా పోరాడాలి.
– శరత్, రిచ్మండ్ విల్లా
కన్నీళ్లు పెడుతున్న మూసీ
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మూసీ నది కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మూసీ నది వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది లేకున్నా భూములను కొల్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. గత వర్షాకాలంలో జంట జలాశయాల 24 గేట్లు ఎత్తినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పరీవాహక ప్రాంత ప్రజలకు పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల వల్ల ఇబ్బంది అవుతున్నది. ముందుగా కాలుష్యాలను వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం మానేసి అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడమేంటి? ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను గాలికొదిలేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నది. విలువైన భూములను తీసుకుని ఎందుకూ పనికిరాని టీడీఆర్ ఇస్తామంటే ఏం చేసుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలి.
– కోటగిరి అశోక్ కుమార్, అడ్వకేట్, సామాజికవేత్త
మురుగును కట్టడి చేయాలి
మేం ఆఫీసర్స్ కాలనీలో పట్టా భూమిలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా ఇల్లు బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. మానాన్న రెండో ప్రపంచ యుద్ధంలో మన దేశం తరఫున వెళ్లి పాల్గొన్నారు. నేను 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. కానీ ప్రభుత్వం మా ఇల్లు కూలుస్తామంటున్నది. దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడితే మాకిచ్చే బహుమానం మా ఇల్లు లాక్కోవడమేనా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూసీలోకి వచ్చే మురుగును కట్టడి చేయాలి. మురుగును శుద్ధి చేయాలి. కానీ ప్రజల ఇండ్లను కూల్చి పెద్ద పెద్ద భవనాలు కడతామనడం సరికాదు. ఇప్పటికైనా ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వెనక్కి తీసుకుని ప్రజల సంక్షేమానికి పాటుపడాలి.
– ఆసిఫ్ అలీ, ఆఫీసర్స్ కాలనీ