BRSV | ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చినట్లుగా నిధులను కేటాయించాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ గడిచిన 15 నెలలుగా విద్యా రంగానికి నిధులు లేకపోవడంతో నాసిరకం భోజనాల వలన గురుకులాల్లో చదువుతున్న 58 మంది విద్యార్థులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులని ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తే, రేవంత్ రెడ్డి పాలనలో విద్యార్థులను పాడెలు ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు.
గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగు లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. ఎనిమిది వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు, రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు అదనంగా రూ. వంద కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగానికి పొరుగు రాష్ట్రాలైన బీహార్లో 21.4 శాతం నిధులు, ఢిల్లీలో 21.57 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణలో మాత్రం కేవలం 7.3 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే సరిపోతుందని, ఆయన ఢిల్లీలోనే ఉండడం మంచిదని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక ఢిల్లీకి దాసుడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.