హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువకులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద కలిసి శాంతియుత నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదని, .. గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జీవో నంబర్ 29ని వెంటనే రద్దు చేసి, జీవో నంబర్ 55ను అమలు చేయాలన్నారు. గ్రూప్-1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని, గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు చటారి దశరథ్, జంగయ్య, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, రాకేష్, సాయి గౌడ్, సంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.