హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. రాబోయే రెండేండ్ల్ల తర్వాత బలమైన తుఫాన్ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ కొట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి, బూత్ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మారెట్లో డబ్బు లేకపోవడంతో పండుగల సమయంలో కూడా వ్యాపారం జరగట్లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రజలు ఆరు గ్యారెంటీలను 420 హామీలుగా భావిస్తున్నారని, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రలోభాలకు గురయ్యారని అభిప్రాయపడ్డారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి ఈ ఎన్నికను గెలిచారని ఆరోపించారు. ప్రస్తుత ఫలితం ఓటమి కాదని, కేటీఆర్, హరీశ్‌రావుల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్ అంతా మనదేనని, గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను ఒకసారి ఓడిస్తే.. మళ్లీ 20-25 ఏండ్ల దాకా లేవదని పేర్కొన్నారు.
ధైర్యంగా ఫోన్‌చేయండి సునీతాగోపీనాథ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన గెలుపు కోసం అందరూ శక్తివంచన లేకుండా కష్టపడ్డారని బీఆర్ఎస్ నేత మాగంటి సునీతాగోపీనాథ్ చెప్పారు. కార్యకర్తలు ఇకపై కూడా ఏ సమస్య వచ్చినా ధై ర్యంగా ఫోన్ చేయాలని, ఆపదలో అండగా ఉంటానని భరోసా ఇ చ్చారు. తన గెలుపు కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తవాళ్లు వచ్చి ఓట్లు వేశారని వాళ్లను నివారించలేకపోయానని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గోపీనాథ్ బిడ్డలు అక్షర, దిశిర కష్టం చాలా పెద్దదని, తల్లి విజయం కోసం ఇంటింటికీ తిరిగారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మనమే గెలువాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వివేకానందగౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, నాయకులు సోహైల్, ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డబ్బులు పంచితే అడ్డుకోలేకపోయాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, అడ్డుకోలేకపోయామని బీఆర్ఎస్ నేతలు వాపోయారు. పోలింగ్ చివరి రోజు మనం దెబ్బతిన్నామని, డబ్బులు, చీరలు, కుక్కర్లను కాంగ్రెస్ పార్టీ నేతలు పంచారని తెలిపారు. గెలిచిన తర్వాత తమను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి గల కారణాలను డివిజన్ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ వాళ్లు పార్టీ కండువాలతో బూత్‌లో కూర్చున్నారని, ఇదేమిటనే ప్రశ్నిస్తే పోలీసులు వారికే వత్తాసు పలికారని చెప్పారు. పోలింగ్ రోజు కాంగ్రెస్ దౌర్జన్యం, అరాచకం పెరిగిందని తెలిపారు. మన వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యర్థులు ఉన్నారని, వారిని గుర్తించకపోవడం వల్ల మన ప్లాన్ వాళ్లకు తెలిసిపోయిందని అన్నారు. డబ్బులు, ప్రలోభాల ముందు మన ప్రచారం పనిచేయలేదని, రిగ్గింగు పెరిగిపోయిందని, అధికారబలంతో రెచ్చిపోయారని తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు సాగిలపడ్డారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.